“పంట నష్టం వాటిల్లితే అధికారుల నుంచి కనీసం పలకరింపు లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ పాలకులు ఎక్కడ ఉన్నారు. రైతుకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ మేముంటామని చెప్పారు. ఇప్పుడు అకాల వర్షాలకు పంట నష్టపోతే పట్టించుకున్న దిక్కు లేదు” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రైతులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి గారు రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రకటించారని అంటూ ఆ నిధి ఏమయ్యిందో ప్రభుత్వంలో ఉన్న వారికే తెలియాలని ఎద్దేవా చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారు? అని ప్రశ్నించారు. ఎకరాకి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అయ్యింది. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయామని రైతులు చెప్పారు.
“ధాన్యం నల్లపాయ వచ్చేసింది. మాకు వ్యవసాయం తప్ప మరో పని చేతకాదు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతున్నారు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు రైతుల నెత్తినే వేస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
“బస్తాకి రూ. 1200 నుంచి రూ. 1300 మాత్రమే వస్తోంది. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదు. రైతు పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనమని అడుగుతున్నాం. మొదట 33 బస్తాలు కొంటామన్నారు. రైతులంతా ధర్నా చేస్తే ఇప్పుడు కొంత పెంచారు” అంటూ రైతులు తమ గోడును పవన్ కల్యాణ్ కు చెప్పుకున్నారు.