ఇటీవల ఒక భక్తుడు తిరుమలలో శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లి ఆనంద నిలయమును వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో అక్కడ భద్రతా వ్యవహారాలపై కలకలం చెలరేగింది. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ఆలయంలోకి తీసుకువెళ్లడం భద్రత సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని టిటిడి ఈఓ ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ చూసి భక్తుడు భద్రత సిబ్బందిని మోసం చేసి ఆలయంలోనికి మొబైల్ ఫోన్ తీసుకు వెళ్లినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. అతనిని గుర్తించి తిరుపతికి తీసుకోస్తున్నాట్లు చెప్పారు.
శ్రీవారి ఆలయంలో గంటకు 5,500 మందిని దర్శనానికి పంపించాలి. గురువారం క్షుణంగా తనిఖీ చేయడం వల్ల గంటకు 2,500 మందిని మాత్రమే దర్శనానికి పంపినట్లు చెప్పారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, కేంద్ర భద్రతాధికారులు తిరుమలకు వచ్చి నూతన భద్రత వ్యవస్థను రూపొంధించనున్నట్లు తెలిపారు.
తిరుమలలో సిసి టీవీ వ్యవస్థ చాలా బాగుందని, వెనక్కి వెళ్లి ఆ అజ్ఞాత భక్తుని గుర్తించడం జరిగిందని చెప్పారు. త్వరలో ఆధునిక భద్రత పరికరాలు, స్కానింగ్ మిషన్లు, అదనపు భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు ఈవో వివరించారు.