తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై తెలంగాణ సర్కార్‌కు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల విభజనపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లో ఏపీ సర్కార్ రీజాయిండర్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రూ.1.42 లక్షల కోట్లకు సంబంధించి ఆస్తుల విభజనపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సుందరేశ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తుల విభజనపై నోటీసులిచ్చి ఐదు నెలలైనా తెలంగాణ సర్కార్ నుంచి సమాధానం లేదని ఏపీ తరఫు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయినప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదని తెలంగాణ తరఫు అడ్వకేట్‌ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన తెలంగాణ తరఫు న్యాయవాది ఆఖరి అవకాశంగా తమకు నాలుగు వారాల టైం ఇవ్వాలని కోరారు.
అంతకు ముందు ఈ సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు జనరల్ (ఏఎస్ వో) నటరాజన్ చొరవ చూపగలరా? అని జస్టిస్ జేకే మహేశ్వరి అభిప్రాయం కోరారు. కాగా, ఆస్తుల పంపకం ఏపీ విభజన చట్టంలోని అంశమే కాకుండా, దాదాపు 1.42 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారమని సింఘ్వి ధర్మాసనానికి వివరించారు.
గతంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి కమిటీని నియమించినట్లు, ఆస్తుల విభజనపై కూడా రిటైర్డ్ జడ్జ్ తో కమిటీ వేయాలని కోరారు. అయితే, ఏపీ తరఫు న్యాయవాది లేవనెత్తిన ఈ సూచనపై ధర్మాసనం ఏఎస్ వో అభిప్రాయాన్ని కోరింది.
ఈ విధంగా రిటైర్డ్ జడ్జ్‌తో కమిటీ వేయవచ్చా? అని ప్రశ్నించగా.. ఇది సాధ్యమే అని, మధ్యవర్తిగా రిటైర్డ్ జడ్జ్‌ని నియమించొచ్చని ఏఎస్వో సమాధానం ఇచ్చారు. అయితే, ఈ అంశంపై రాష్ట్ర సర్కార్ అభిప్రాయాన్ని తెలుసుకొని కోర్టుకు నివేదిస్తామని తెలంగాణ తరఫు న్యాయవాది నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్రం, తెలంగాణ సర్కార్ కు నోటీసులు జారీ చేస్తూ… తదుపరి విచారణను జులై చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.