మల్లినాధుని జన్మస్థలం, మెదక్ జిల్లా కొల్చారంలో తెలుగు సంస్కృత భాషా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యల కోసం కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.
సమైక్య పాలనలో విస్మరించబడిన తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింపచేసుకోవాలని సిఎం తెలిపారు. కాలగర్భంలో విస్మరించబడిన మల్లినాథసూరి వంటి నాటి ప్రముఖ భాషా కవి పండిత మహనీయుల ఘన చరిత్రలను వెలికితీయాలని సిఎం పేర్కొన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున గోపనపల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ భావి తరాలకు శాంతిని భక్తిభావనలు పంచే ఆధ్మాత్మిక కేంద్రంగా, అన్ని వర్గాలకు అందుబాటులో వుండే కమ్యునిటీ సెంటర్‌గా కొనసాగుతుందని సిఎం ఆకాంక్షించారు. ఈ భవనాన్ని, ఈ నెల 31వ తేదీన ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో బ్రాహ్మణ పరిషత్ భవన్ రాష్ట్రంలో దైవ భక్తిని పెంపొందించే దిశగా ఆధ్మాత్మిక గ్రంధాలు, వేదాలు, ఉప నిషత్తులు, పురాణాలు వంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.
సత్యనారాయణ వ్రతం వంటి దైవ కార్యాలకు సంబంధించిన, యజ్జ యాగాదులు క్రతువులకు సంబంధించిన అవగాహనను కల్పించే సాహిత్యాన్ని అందుబాటులో వుంచాలని సిఎం తెలిపారు. దైవ భక్తులయిన సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పుస్తకాలను ప్రచురించాలని డాక్యుమెంటరీలను రూపొందించాలని సిఎం కెసిఆర్ సూచించారు. మొత్తంగా బ్రాహ్మణ పరిషత్ భవనం, భక్తి, ఆధ్మాత్మిక భావజాలవ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్ సెంటర్‌గా కొనసాగాలని సిఎం అన్నారు.