తెలంగాణలో రజాకార్ల, బకాసురుల రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హిందువులను సంఘటితం చేసేందుకు వినాయక ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ నిర్వహించినట్లే.. తెలంగాణలో హిందువులను సంఘటితం చేసేందుకు హిందూ ఏక్తా యాత్ర చేపట్టామని చెప్పారు.
కర్నాటకలో హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం కోల్పోవడం వల్లే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేసే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం రాత్రి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి ఆయన హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.
‘‘హిందువుల గురించి మాట్లాడొద్దంటున్నారు. తెలంగాణలో 80 శాతానికి పైగా హిందువులు ఉన్న హిందువుల గురించి మాట్లాడాలా వద్దా’’ అని ప్రజలను ప్రశ్నించారు. ఇక్కడ కూడా పాకిస్థాన్ జిందాబాద్ అంటే ఒప్పుకొందామా?” అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ పెద్దలకు చెందిన మెడికల్ కాలేజీలో ఒక ఉగ్రవాదిని హెచ్వోడీగా చేశారని పేర్కొంటూ ఐఎస్ఐ వంటి ఉగ్రమూకలకు, కుహానా లౌకికవాద పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
‘‘370 ఆర్టికల్ రద్దవుతుందని ఎవరూ అనుకోలేదు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ దాన్ని రద్దు చేసింది. అలాగే దేశంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురాబోతున్నాం”అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం అవుతుందని చెప్పారు. లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా రాష్ట్రంలో ఆరు వేల మదర్సాలను బంద్ చేయించాం. దీంతో ఒవైసీ నా సంగతి చూస్తానని బెదిరించారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా. ఒవైసీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా. ఆయన ఇంటికి కూడా వస్తా. ఏం చేస్తాడో చూస్తా” అని సవాల్ విసిరారు.
అస్సాంలో రూ.98కే పెట్రోల్ వస్తుందని, కానీ తెలంగాణలో రూ.108 ఉందని విమర్శించారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఫస్ట్ తారీఖునే వస్తుందని, తెలంగాణలో పదో తారీఖు దాటినా రావడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకటేనని, బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. హిందువులంతా కేరళ స్టోరీ చూడాలని, హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా మారుస్తున్నారో అందులో చూపించారని తెలిపారు.