మయన్మార్ లో మోకా తుఫాను సోమవారం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల వల్ల పలు పట్టణాల్లో వరదలు పోటెత్తాయి. తీరంలోని పది లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీళ్లు చేరాయి. తుఫాను ధాటికి పశ్చిమ మయన్మార్ తీర ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు.
సిత్వె టౌన్ షిప్లో మఠాలు, స్కూళ్లలో తలదాచుకున్న 20 వేల మందిలో బలమైన గాలులకు 700 మంది గాయపడ్డారు. భీకర గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరద నీళ్లు వీధులు, ఇండ్లలోకి చేరాయి. దీంతో స్థానికులు బిల్డింగులు, అపార్ట్మెంట్ల పైకప్పులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
సముద్ర మట్టం 12 అడుగుల ఎత్తుకు పెరిగింది. సముద్రపు నీళ్లలో చిక్కుకున్న వెయ్యి మందిని రెస్క్యూ బలగాలు రక్షించాయి. తుఫాను ధాటికి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. ఆదివారం మధ్యాహ్నం మోకా తుఫాను తీరం దాటింది.
‘‘ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత తుఫాను కాస్త బలహీనపడింది. వరద నీటిలో చిక్కుకోకుండా చాలా మంది స్థానికులు రాత్రంతా ఇండ్ల పైకప్పులు ఎక్కి కూర్చున్నారు. రాత్రంతా గాలులు భీకరంగా వీచాయి. సోమవారం ఉదయం వరదలు పోటెత్తిన ప్రాంతాల్లో 5 ఫీట్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చాయి” అని ఓ అధికారి తెలిపారు.
“ఉదయం గాలుల తీవ్రత తగ్గడం, ఎండ కాయడంతో సహాయక పనులు ముమ్మరం చేశాం. లోతట్టు ప్రాంతాల్లోని నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయం చేయాలని సివిల్ సొసైటీ సంస్థలు, అధికారులకు విజ్ఞప్తి చేశాం” అని ఆ అధికారి వివరించారు.
పశ్చిమ మయన్మార్ తీరం పొడుగునా 12 అడుగుల లోతు సముద్ర ఉప్పెన నీటిలో మునిగిన ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు సోమవారం తరలించారు. సిట్వే టౌన్షిప్లో దాదాపు 20 వేల మందిని మఠాలు, పాఠశాలలు, గోపురాల భవనాల్లో ఆశ్రయం కల్పించామని సిట్వే లోని రఖినే యూత్స్ ఫిలాంత్రోఫిక్ అసోసియేషన్‌కు చెందిన సహాయకులు వెల్లడించారు.
లోతట్టు ప్రాంతాల్లో సోమవారం కూడా ఐదు అడుగుల లోతులో వరదనీరు నిల్చి ఉంది. వరద ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడానికి సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని , పౌరసేవా సమాజాలను అసోసియేషన్ అభ్యర్థించింది. రఖినే రాష్ట్రంలో 17 టౌన్షిప్లకు రాష్ట్ర అధికార యంత్రాంగం విపత్తు హెచ్చరికలు జారీ చేసింది. సిట్వే, క్యాయుపైయు , గ్వా టౌన్‌షిప్‌ల్లో ఇళ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బాదా దెబ్బతిన్నాయని మయన్మార్ మిలిటరీ కార్యాలయం వెల్లడించింది.
కాగా, మోకా తుఫాను ప్రభావం నుంచి బంగ్లాదేశ్ బయటపడింది. ఆ దేశంపైనా మోకా ప్రభావం ఉండొచ్చని అధికారులు ముందు హెచ్చరించారు. దీంతో తీర ప్రాంతా ల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావం పెద్దగా పడలేదని, సెయింట్ మార్టిన్ దీవిలో 12 మంది గాయ పడ్డారని బంగ్లాదేశ్ మీడియా తెలిపింది. 300 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయని వివరించింది.