కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణాలో సహితం ఆ పార్టీ లో జోష్ పెరుగుతున్నది. ఇప్పటి వరకు సొంతంగా పార్టీ పెట్టుకొని, పాదయాత్ర ద్వారా తెలంగాణాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహితం కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసే దిశలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ సంవత్సరం చివరిలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా ప్రభావం చూపలేమని గ్రహించిన ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర వహించిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక పాత్ర వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణలో వైఎస్ అభిమానుల ఓట్లను పొందడంతోపాటు ఏపీలో సీఎం జగన్ కు చెక్ పెట్టవచ్చని శివకుమార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ విషయమై ఇప్పటికే వారిద్దరి మధ్య చర్చలు జరిగిన్నట్లు కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
షర్మిల చేరిక ద్వారా ఏపీలో నామమాత్రంగా ఉన్న తమ పార్టీ బలం పెంచుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. మరోవంక, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటంతోపాటు వైఎస్సార్ అభిమానులు, రెడ్డి, క్రిస్టియన్ సామాజిక ఓట్లను తమ వైపు కేంద్రీకృతం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు పాదయాత్రలు నిర్వహించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న షర్మిలను చేర్చుకోవడం తెలంగాణలో కొంత మేర కలిసొస్తుందని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే షర్మిల బెంగళూరు వెళ్లడంతో పాటు, అక్కడ డీకే శివకుమార్ ను కలసి సమాలోచనలు జరపడం ఆసక్తి కలిగిస్తున్నది.
ఈ సందర్భంగా శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫోటోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు కూడా. “ప్రియమైన సోదరుడు శ్రీ డీకే శివకుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత జరుపుకొనే ఈ పుట్టిన రోజు మీకు మరింత మధురమైనదని, ముఖ్యమైనదని భావిస్తున్నాను. కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా” అంటూ ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేశారు.
మరోవంక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వ్యూహకర్త సునీల్ కనుగోలు కొంతకాలంగా షర్మిలతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు ఆమె కొన్ని డిమాండ్ లను ఆ పార్టీ అందించినట్లు చెబుతున్నారు.
తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఖమ్మం జిల్లా పాలేరుతో పాటు మరికొన్ని సెగ్మెంట్లను తన అనుచరులకు ఇవ్వాలని ఆమె కోరినట్టు తెలిసింది. ఆమె డిమాండ్లను సునీల్ కనుగోలు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం.