దేశంలోకి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4 నాటికి రుతు పవనాలు కేరళ లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండి) తెలియజేసింది.
అప్పటి వరకు ఎండలు మండుతాయని వెల్లడించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసిన హీట్ వేవ్ ఈనెల మొదటి, రెండువారాల్లో తక్కువగా ఉందని, ఇప్పుడు క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలియజేశారు.
గత ఏడాది మే 29 నాటికే కేరళ తీరానికి చేరుకున్నాయి. కాగా 2021లో జూన్ 3న, అంతకు ముందు ఏడాది జూన్ 1న ప్రవేశించాయి. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పటినప్పటికీ భారత్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం గత నెల ప్రకటించింది.
దేశంలో వ్యవసాయానికి అత్యంత కీలకమైన రుతుపవనాలపైనే 52 శాతం వ్యవసాయం ఆధారపడి ఉంది. ఇది దేశం మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటాకు సమానం. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక సుస్థిరతకు కీలకమైన సహకారం లభిస్తుంది.హీట్‌వేవ్ రాబోయే 7 రోజులు పెద్దగా లేకపోయినా ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయన్నారు.
40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాజస్థాన్‌లలో దుమ్ముతో కూడిన గాలులు వీస్తున్నాయని, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గతవారం కంటే ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత కూడా వేడి ఆవిర్లు వస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈనెల 18వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మోచా తుఫాన్ ప్రభావం (ఆఫ్టర్ సైక్లోన్) వల్ల ఎండ పెరిగిందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
తుఫాన్ తర్వాత గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిందని, వాతావరణం పొడిగా మారిందని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల 18వ తేదీ వరకు కోస్తాలో గరిష్ఠంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని చెబుతున్నారు. సముద్ర ఉపరితలం నుంచి వేడిగాలులు వీస్తుండటంతో కోస్తా జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.
