టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ నాయకులు రోడ్డున పడి కొట్టుకున్నారు. నంద్యాల జిల్లాలో పాదయాత్ర జరుగుతుండగా రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దిగవంత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు మంగళవారం దాడికి పాల్పడ్డారు.
ఆస్తుల వివాదం నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డికి అఖిల ప్రియ వర్గానికి మధ్య గత కొన్నాళ్లుగా రగడ నడుస్తోంది. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి గాయపడ్డారు. దానితో, భూమా అఖిల ప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం నంద్యాలకు తరలించారు.
అఖిలప్రియ పి ఎ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం బుధవారం ఉదయాన్నే ఆమె ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు నిన్నటి ఘటన, అక్కడి పరిణామాలపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఆదేశాలతోనే దాడి జరిగిందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.
అఖిలప్రియతో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మరోవైపు నంద్యాల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఏబీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.లోకేష్ యువగళం పాదయాత్రలో బలాన్ని నిరూపించుకునేందుకు తమపై దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం నంద్యాల నియోజకవర్గంలో యాత్ర ప్రారంభం కాగానే పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి తన అనుచరులతో పాల్గొనే ప్రయత్నం చేశారు. అంతకుముందే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. నారా లోకేష్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు.
లోకేష్‌తో కలిసి నడిచే క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పర వాగ్వాదం కాస్త క్షణాల్లో తన్నులాటగా మారింది. నారా లోకేష్ ఎదుటే భూమా, ఏవి అనుచరులు పరస్పర దాడులకు దిగారు. ఒకరిపై ఒకరి పిడుగులు గుద్దుకున్నారు.
ఏవి సుబ్బారెడ్డి పై అఖిలప్రియ అనుచరులు దాడికి దిగారు, సుబ్బారెడ్డిని రోడ్డుపై పారేసి కాళ్లతో తన్నడం కనిపించింది. ఈ క్రమంలో ఏవి అనుచరులు కూడా అఖిలప్రియ అనుచరులపై దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టి అదుపులోకి తెచ్చారు. సంఘటన అనంతరం పాదయాత్ర నుండి నేరుగా పట్టణ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.