పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మే 9 తర్వాత దాఖలైన ఏ కేసులోనూ మే 31 వరకు అరెస్ట్ చేయొద్దని పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తనను మళ్లీ అరెస్టు చేయబోతుందనే అనుమానంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇమ్రాన్ ఖాన్, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ ఖాన్ ఇమ్రాన్ విజ్ఞప్తిని అంగీకరించారు. ఈ వాదనల సమయంలో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫున గోహర్ ఖాన్ వాదనలు వినిపించారు. ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన అన్ని కేసుల వివరాలను కోరుతూ పీటీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. పీటీఐ చీఫ్‌పై దేశవ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయని ఖాన్ పార్టీ చెబుతోంది.
అల్- ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు గత శుక్రవారం రెండు వారాల పాటు ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేసింది. మే 17 వరకు దేశంలో ఎక్కడా నమోదైన కేసులోనూ ఆయన్ను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు కూడా అలాంటి కేసులకు సంబంధించిన అన్ని వివరాలను అందించాలని ఆదేశించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు కొంత ఊరట లభించింది.
మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. అయితే.. ఆయన్ను అరెస్టు చేయడం “చట్టవిరుద్ధం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 10వ తేదీన కోర్టు తీర్పు వెల్లడించింది. అప్పుడు ఆయనకు బెయిల్ లభించినా, మళ్లీ అరెస్ట్ చేస్తారన్న భయంతో గంటల తరబడి హైకోర్టు ఆవరణలోనే ఉన్నారు. శనివారం లాహోర్ ఇంటికి వెళ్లినట్టు అక్కడి మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.
మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో పారామిలటరీ రేంజర్లు ఖాన్‌ను అరెస్టు చేయడంతో పాక్‌లో అశాంతి నెలకొంది. పాకిస్తాన్ చరిత్రలో తొలిసారిగా నిరసనకారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇదిలావుండగా, ఇస్లామాబాద్ హైకోర్ పీటీఐ నాయకులు మలికా బొఖారీ, అలీ ముహమ్మద్ ఖాన్ల నిర్బంధాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించింది. వారిని విడుదల చేయాలని ఆదేశించింది.