తమిళనాడులో నిర్వహించే ‘జల్లి కట్టు’ క్రీడను సుప్రీంకోర్టు సమర్థించింది. జల్లికట్టును అనుమతించే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, అజరు రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేష్రారు, సి.టి రవికుమార్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా జంతువులతో కూడిన క్రీడలను అనుమతిస్తూ మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన చట్టాల చెల్లుబాటును కూడా సుప్రీంకోర్టు అనుమతించింది. అలాగే గత కొన్ని శతాబ్దాలుగా జల్లికట్టు కొనసాగుతోందని ఈ సందర్భంగా సుప్రీం నొక్కి చెప్పింది. అలాగే ఈ చట్టాలపై రాష్ట్రపతి ఆమోదం పొందినందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
‘జల్లికట్టు’ ఎద్దుల బండ్ల పందేలను అనుమతించే రాష్ట్రాల చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అన్ని చట్టాలు ఖచ్చితంగా అమలు చేయబడుతుందని, సవరించిన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి జిల్లా మెజిస్ట్రేట్లు, అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది.
తమిళనాడులో నిర్వహించే ‘జల్లికట్టు’ కార్యక్రమం కూడా ఓ సాంస్కృతిక కార్యక్రమమేనని, ఈ క్రీడలో ఎద్దులపై క్రూరత్వం లేదని తమిళనాడు ప్రభుత్వం జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (తమిళనాడు సవరణ) చట్టం, 2017 జంతువులకు కలిగే నొప్పి, బాధలను బాధలను తగ్గిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, తమిళనాడులో పంటలు బాగా పండిన సందర్భంగా పొంగల్ పండుగను ప్రతి ఏటా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ క్రీడకు అనుకూలంగా జంతువులపై ‘క్రూరత్వ నిరోధక చట్టం 1960’ కేంద్ర చట్టాన్ని తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు సవరించాయి.
ఈ రెండు రాష్ట్రాలు జల్లికట్టు, ఎద్దుల బండి పందేలాను అనుమతించాయి. అయితే జంతు రక్షణ కోసం ఉన్న క్రూరత్వ నిరోధక చట్టం (తమిళనాడు సవరణ) 2017ను సవాల్ చేస్తూ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పిఇటిఎ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జల్లికట్టుకు వ్యతిరేకంగా వేసిన ఈ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్నే సమర్థించింది. అయితే 2018లో తమిళనాడు, మహారాష్ట్ర ప్రజలు జల్లికట్టు, ఎద్దుల బండ్ల పోటీలను తమ సాంస్కృతిక హక్కుగా పరిరక్షించవచ్చా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 (1) ప్రకారం వారి రక్షణను డిమాండ్ చేయగలరా అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సూచించింది. గతంలో సుప్రీం అలాంటి వ్యాఖ్యలను చేసినప్పటికీ, తాజాగా సుప్రీం ఈ పిటిషన్లపై సమర్థిస్తూ తీర్పునివ్వడం గమనార్హం.