హైదరాబాద్ నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్ సాగర్‌కు మరిన్ని మంచి రోజులు రానున్నాయి. గతంలో కంపుకొట్టే మురుగునీటితో ముక్కుపుటాలు అదిరిపోయే హుస్సేన్ సాగర్ పరిసరాలు మాత్రమే ఉండేవి. కానీ క్రమంగా స్వేచ్ఛగా విహరించేలా పర్యాటక ప్రాంతంగా సర్కారు తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే ఒకప్పుడు యథేచ్ఛగా నాలాల నుంచి కలిసే వ్యర్థాలతో కాలుష్య కాసారంగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌కు జీవం పోసేలా తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఆధునీకరణ, బయో రెమిడియేషన్, వ్యర్థ జలాల మళ్లింపు వంటి కార్యాచరణతో ఊపిరి పోసింది. ఈ క్రమంలో గోదావరి జలాలతో హుస్సేన్‌సాగర్ నింపి, నిత్యం మంచినీరు ప్రవహించేలా చర్యలకు సిద్ధమవున్నది.
గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించిన సీఎం కేసీఆర్ జంట జలాశయాలను కాళేశ్వరం నీటితో నింపుతూనే, అక్కడి నుంచి హుస్సేన్‌సాగర్‌కు గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించింది. జంట జలాశయాల పరివాహక ప్రాంతం నుంచి హుస్సేన్‌సాగర్‌కు అనుసంధానంగా ఉన్న బుల్కాపూర్ నాలా ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి.
హుస్సేన్ సాగర్‌కు ఎగువన ఉన్న బుల్కాపూర్, కూకట్పల్లి, బంజారా నాలా, పికెట్ నాలాల ద్వారా ఒకప్పుడు మంచినీరు ప్రవహించేవి. సమైక్యపాలనలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ప్రాధాన్యత లేకపోవడంతో నాలా పరివాహక ప్రాంతాలన్నీ అన్యాక్రాంతానికి గురయ్యాయి.
ఈ క్రమంలో యథేచ్ఛగా మురుగు నీరు చేరడంతో హుస్సేన్‌సాగర్ జీవం కోల్పోయింది. పారిశ్రామిక వ్యర్థాలతో, విసర్జిత జలాలతో కాలుష్య కాసారంగా తయారైంది. తాజాగా దాదాపు 18కిలోమీటర్ల మేర జంట జలాశయాల పరివాహాక ప్రాంతాల నుంచి ప్రవహించే బుల్కాపూర్ నాలా ద్వారా గోదావరి(కాళేశ్వరం) జలాలతో నింపనున్నారు.
దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా మురుగునీటిని నియంత్రించడంతోపాటు, చారిత్రక వారసత్వ సంపదగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను పరిరక్షించుకునేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.