ఇటీవల వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కనిపిస్తున్నది. ఈ చట్టం ఉపసంహరణ గురించి పరిశీలించేందుకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (ఎన్ఈ) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఐజిఎఆర్ (ఎన్), సీఆర్పీఎఫ్ ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ కమిటీ నివేదిక 45 రోజుల్లోగా వస్తుందని పేర్కొంది. ఈ సిఫారసుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పటికే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ నాగాలాండ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.
కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. వారంట్ లేకుండా అనుమానితులను అరెస్టు చేయడానికి భద్రతా దళాలకు ఈ చట్టం ప్రకారం అధికారాలు లభిస్తున్నాయి. ఈ విషయమై భద్రతా దళాలకు తమ వచ్చే ఆరోపణలను కోర్ట్ విచారణ లేకుండా రక్షణ కూడా లభిస్తుంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఓ సమావేశం నిర్వహించిన సమావేశంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో, ఉప ముఖ్యమంత్రి వై పట్టోన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
డిసెంబరు 4న నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించడంతో ఈశాన్య రాష్ట్రాలు కలిసికట్టుగా సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతున్నాయి. పౌరులను తీవ్రవాదులుగా `పొరపాటు’ గా భావించి సైన్యం కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనతో నేరుగా సంబంధంగలవారిపై దర్యాప్తు జరుపుతామని నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
మరోవంక, న్యాయమైన విచారణ తర్వాత డిసెంబర్ ప్రారంభంలో నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో జరిగిన తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆర్మీ సిబ్బందిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న ఆర్మీ సిబ్బందిని సస్పెన్షన్‌లో ఉంచవచ్చని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఈ చట్టం ఉపసంహరణ కోసం నాగాలాండ్‌లోని అనేక జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి, ఈ నెల ప్రారంభంలో మోన్ జిల్లాలో భద్రతా దాడిలో 14 మంది పౌరులు మరణించిన సంఘటనపై విచారణ కోర్టు “వేగంగా పురోగమిస్తోంది” అని, “రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సిట్ విచారణకు సహకరిస్తున్నట్లు” సైన్యం ఆదివారం తెలిపింది. .