35 ఏండ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్త పోలీసు స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా మేరకు కొత్త పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
35 ఏండ్ల కింద కమిషనరేట్ పరిధిలో 25 లక్షల జనాభా ఉండేది. ఇప్పుడు నగర జనాభా 85 లక్షలకు పెరిగిందన్నారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారని సీపీ గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పీఎస్‌లు, 13 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతో పాటు 5 కొత్త ఉమెన్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సచివాలయం కోసం కొత్త పీఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
సెక్రటేరియట్ పీఎస్‌ను బీఆర్కే భవన్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్ పీఎస్‌కు స్పెషల్‌గా ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కోసం ఒక డీసీపీతో పాటు 148 మంది పోలీసులను కేటాయించినట్లు తెలిపారు.
నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాధ్ నగరంలో 3 కమిషనరేట్లు కలుపుకొని 2 కోట్ల జనాభా ఉందని.. వచ్చే 15 సంవత్సరాల అవసరాలను దృష్ట్యా శాంతి భద్రతల కోసం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
నగరంలో 80 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. 6 నెలల పాటు రీ ఆర్గనైజేషన్ కమిటీ కూర్చుని కొత్త పీఎస్‌లకు ప్రపోజల్ పెట్టింది. కొత్త పోలీస్ స్టేషన్లతో కలిపి ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 78 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ కలక్టరేట్ బిల్డింగ్‌లోకి అబిడ్స్ పోలీసు స్టేషన్ మార్చారు.
ఫిలింనగర్లో ఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మధుర నగర్ పోలీస్ స్టేషన్‌గా రెహ్మత్ నగర్ ఓపీ బిల్డింగ్. సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌లో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌లో మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్. బొరబొండ ఔట్ పోస్ట్ పోలీస్ వద్ద బోరబండ పోలీస్ స్టేషన్. చిలకలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ఇంకా స్థలం దొరకలేదు.
ప్రతి జోన్‌కు ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని ఆనంద్ తెలిపారు. సీసీఎస్, డీడీ , సిట్ కలిపి 629 మంది సిబ్బంది ఉంటారు. సైబర్ క్రైమ్ కోసం 148 మందిని నియమించారు. సోషల్ మీడియా , ఐటి సెల్ కోసం 243 మంది పోలీసులు ఉంటారు. డ్రగ్స్ విభాగం హెచ్ న్యూ కోసం 34 మందిని కేటాయించారు. 7 టాస్క్ ఫోర్స్ జోన్లో 209 మంది ఉంటారు. షీ టీమ్స్ కోసం 77 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని సీపీ ఆనంద్ వెల్లడించారు.