ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేలా వ్యూహాత్మక భాగస్వామి అయిన రష్యాపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా చైనాను జి-7 దేశాల నేతలు కోరారు. చైనాకు హాని కలిగించాలని తాము కోరుకోవడం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పైగా బీజింగ్‌తో నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన సంబంధాలు కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.
ఈ మేరకు వారు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ”చైనాతో నిజాయితీగా వుండడం, పైగా చైనాకే నేరుగా తమ ఆందోళనలు తెలియచేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించామని” ఆ ప్రకటన పేర్కొంది. ఉక్రెయిన్ నుండి తక్షణమే, పూర్తిగా, బేషరతుగా బలగాలను ఉపసంహరించాలని రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని చైనాను కోరుతున్నామని ఆ ప్రకటన పేర్కొంది.
ఐక్యరాజ్య సమితి నిబంధనావళి, ప్రాదేశిక సమగ్రత ఆధారంగా సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతికి చైనా మద్దతివ్వాలని కోరారు. అంతర్జాతీయంగా చైనా పోషిస్తును పాత్ర, దాని ఆర్థిక వ్యవస్థ పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని చైనాతో సహకారం అవసరమని జి-7 దేశాలు అభిప్రాయపడ్డాయి.
వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం, ముప్పు ప్రమాదాలను తీవ్రంగా ఎదుర్కొనే దేశాల రుణాలు, వాటి ఆర్థిక అవసరాలు, అంతర్జాతీయ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సుస్థిరతల కోసం కలిసి కృషి చేయాలని పిలుపిచ్చింది. అయితే తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో పరిస్థితుల పట్ల కూడా నేతలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.
తైవాన్ విషయంలో శాంతియుత పరిష్కారం కావాలనివారు పిలుపిచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా వాదనలకు చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదని ఆ ప్రకటన పేర్కొంది. ఆ ప్రాంతంలో చైనా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చైనా పోషించే పాత్ర అంతర్జాతీయ ప్రయోజనాలను అందిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.
అప్పుల్లో కూరుకున్న దేశాలకు సాయం
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో అప్పుల్లో కూరుకున్న దేశాలకు ఆర్థిక సాయమందిస్తామని జీ7 కూటమి దేశాధినేతలు ప్రకటించారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జపాన్‌లోని హిరోషిమాలో ప్రారంభమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైల్వేలు, క్లీన్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 600 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నేతలు ప్రకటించారు.