తెలుగు జాతి ఆస్తి, వారసత్వమైన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని హైదరాబాద్ కేపీహెచ్‌బీ కైత్లాపూర్ మైదానంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో పలువురు డిమాండ్ చేశారు.
మహా నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు వచ్చేదాకా తెలుగు జాతి పోరాడుతుందని, ఆయనకు పురస్కారం సాధించి తీరతామని ముఖ్యఅతిధిగా పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎన్టిఆర్ ఒక శక్తి, స్ఫూర్తి అని, ఆయనను గౌరవించుకోవడమంటే దేశాన్ని గౌరవించుకున్నట్లేనని పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రతి తెలుగువాడి మనసు గెలుచుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. ‘‘రాజకీయాలకు క్రమశిక్షణ తెచ్చిన నాయకుడు. రాజకీయాలు ప్రజల కోసమే అని నిరూపించారు. నీతి, నిజాయతీకి మారు పేరుగా నిలిచారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదనం గురించి ఢిల్లీకి చాటారు’’ అని తెలిపారు.
భావి తరాలకు ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి తెలిపారు. పదవి అధికారం చెలాయించేందుకు అనే భావన ఉన్న పరిస్థితుల్లో.. పదవి సేవకు అని సరికొత్త నిర్వచనం పలికిన మహానేత అని చెప్పారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టిఆర్ విశేష కృషి చేశారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కొనియాడారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి సమాఖ్య స్ఫూర్తి కొనసాగించారని తెలిపారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ, ఎన్టిఆర్ గొప్ప జాతీయ నాయకుడని తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేశారన్నారు. నేషనల్ ఫ్రంట్‌లో ముందుండి జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రను దేశానికి చాటిచెప్పారని గుర్తు చేశారు.
దగ్గుబాటి కుటుంబం నుంచి హీరో వెంకటేశ్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగా హీరో రాంచరణ్, ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, అక్కినేని వారసులు సుమంత్, నాగచైతన్య, హీరో కృష్ణ సోదరుడు, పద్మాలయ స్టూడియోస్ అధినేత జి.ఆదిశేషగిరిరావు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ ఇలా పలువురు సినీ రంగ ప్రముఖులు, యువ హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు.
మహానటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, లోకేశ్వరి, రోజారమణి, జయప్రద, జయసుధ, విజయా విశ్వనాథ్, ఎన్టీఆర్ సన్నిహితుడు మల్లికార్జున్‌రావు, వేమూరి రవి, కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులను చంద్రబాబు, దత్తాత్రేయతో పాటు ఎన్టీఆర్ కుటుంసభ్యులు ఘనంగా సన్మానించారు.
