ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘పపువా న్యూ గినియా’ దేశ ప్రధాని జేమ్స్ మరాపె పాదాభివందనం చేశారు. జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ఆదివారం పపువా న్యూ గినియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపె ఘన స్వాగతం పలికారు.
విమానం దిగి వస్తున్న ప్రధాని మోదీకి ఆత్మీయ ఆలింగనం చేసిన జేమ్స్ మరాపె.. ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రధాని మోదీ జేమ్స్‌ను పైకి లేపి భుజం తట్టి కౌగిలించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీకి తమ దేశ అధికారులు, రాజకీయ నేతలను జేమ్స్ మరాపె పరిచయం చేశారు.
మరోవైపు పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వారు మోదీతో సెల్ఫీలు దిగి తమ ఆనందం వ్యక్తం చేశారు. పపువా న్యూ గినియాను సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం.
కాగా, సూర్యాస్తమయం తర్వాత పపువా న్యూ గినియాకు వచ్చిన ఏ నాయకుడికి కూడా అధికారికంగా స్వాగతం పలకకూడదని ఆ దేశంలో నియమం ఉంది, కానీ ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఈ దేశం తన సంప్రదాయానికి బ్రేక్ వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప (ఐలాండ్) దేశం రాత్రిపూట ప్రభుత్వ గౌరవాలతో విదేశీ అతిథులను స్వాగతించదు.
కానీ భారతదేశం ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోదీకి పెరుగుతున్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఏకంగా ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేయడం విశేషం.
ఇక, ఫోరమ్ ఫర్ ఇండియా- పసిఫిక్ కార్పొరేషన్ (ఎఫ్ఐపీఐసీ) సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు వచ్చారు. ఈ సమావేశంలో 14 దేశాల నాయకులు పాల్గొంటారు. పపువా న్యూ గినియాలో పర్యటించిన అనంతరం ప్రధాని మోదీ.. నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.