ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రమాదం తగ్గినప్పటికీ.. రాబోయే కాలంలో మరో మహమ్మారి ప్రమాదం పొంచి ఉందని, రాబోయే కాలంలో తదుపరి మహమ్మారిని ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.
మే 21 నుండి 30వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో డబ్ల్యుహెచ్ఓ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో డబ్ల్యుహెచ్ఓ హెడ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ కోవిడ్ -19 మహమ్మారి ముగింపుతో ప్రపంచ ముప్పు ముగిసిపోలేదని, కోవిడ్లాంటిదే మరో వేరియంట్ రూపాంతరం చెందే అవకాశముందని స్పష్టం చేశారు.
ఈ కొత్త వేరియంట్ వల్ కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయని, అత్యధిక మరణాలు కూడా సంభవించే అవకాశముందని అంటూ మరో వ్యాధికారక ముప్పు మిగిలే ఉందని తెలిపారు. కోవిడ్ – 19 మహమ్మారికంటే ‘ప్రాణాంతకమైన’ మరో మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు, అత్యవసర పరిస్థితులను పరిష్కరించే ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘తదుపరి మహమ్మారిరి పుట్టుకొస్తే.. ఆ మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనమంతా నిర్ణయాత్మకంగా, సమిష్టిగా, సమానంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి’ అని ఆయన సలహా ఇచ్చారు.
అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డిజి) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలకు కోవిడ్ – 19 గణనీయమైన ప్రభావాలను కలిగి ఉందని టెడ్రెస్ చెప్పారు. 2017 డబ్ల్యుహెచ్ఓ అసెంబ్లీ సమావేశాల్లో ట్రిపుల్ బిలియన్ లక్ష్యంగా పెట్టుకుంది.
అంటే.. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మందికి సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ ఉందని భరోసా కల్పించడం, మరో బిలియన్ కంటే ఎక్కువ మందికి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నుండి రక్షించడం, మరో బిలియన్ కంటే ఎక్కువమందికి మెరుగైన ఆరోగ్యం కల్పించడం వంటి ట్రిపుల్ బ్రిలియన్ లక్ష్యంగా పెట్టుకుంటే.. ఈ లక్ష్యాల పురోగతిపై కూడా కరోనా ప్రభావితం చేసిందని టెడ్రెస్ వివరించారు.