కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాలో ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి.
నాలుగు పిల్లలో ఒకటి మంగళవారం తెల్లవారు జామున మరణించింది. గురువారం మరో రెండు పిల్లలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. తీవ్రమైన వేడి కారణంగా వాటి ఆరోగ్యం క్షీణించింది పార్క్ అధికారులు పేర్కొంటున్నారు. వీటి మరణంతో కునో నేషనల్ పార్క్‌లో రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఐదుకు చేరింది.
23న చిరుత పిల్ల మృతి చెందిన తర్వాత మూడింటితో పాటు జ్వాలాను పాల్పూర్‌లోని వన్యప్రాణుల వైద్యశాలకు తరలించారు. వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించినా వాటిని కాపాడలేకపోయారు. జ్వాలాతో పాటు పిల్లలు మామూలుగా లేవని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యాయని, పుట్టినప్పటి నుంచి అవి బలహీనంగానే ఉన్నాయని అటవీ శాఖ తెలిపింది.
1948లో మధ్యప్రదేశ్ (ప్రస్తుత ఛత్తీస్‌గఢ్) రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో చిరుతల ( ఓ రకమైన) ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. దీంతో వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది.
దాదాపు 75 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా 20 చిరుతలను కునో నేషనల్ పార్క్‌కు కేంద్రం తరలించగా.. గతేడాది ప్రధాని తన పుట్టిన రోజున సందర్భంగా వాటిని ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు.
ఇప్పటి వరకు సాషా, దక్ష అనే ఆడ చిరుతలతో పాటు ఉదయ్ అనే మగ చిరుత ఇటీవల మరణించాయి. జ్వాలాకు జన్మించిన నాలుగు పిల్లల్లో మూడు మృతి చెందాయి. ప్రస్తుతం ప్రస్తుతం కునోలో 17 చిరుతలు, ఒక పిల్ల మిగిలింది.