కొత్త పార్లమెంటుకు సంబంధించిన బీజేపీకి ప్రతిపక్షాలకు తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంటు భవనం రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడం, ప్రారంభోత్సవానికి అసలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు ఆహ్వానం అందించకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రధాని, బీజేపీ తీరును నిరసిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు.. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదంటూ ఉమ్మడి ప్రకటన చేశాయి.
మరోవైపు పార్లమెంటు ఆవరణలో స్పీకర్ కుర్చీ రాజదండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనిపై తాజాగా దుమారం చెలరేగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటీష్ చివరి వైశ్రాయ్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ అధికార బదిలీకి గుర్తుగా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు అందించినట్లు బీజేపీ వెల్లడించింది. అయితే అందుకు సరైన ఆధారాలు లేవని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. భారత సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ద్వేషిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. భారతదేశ స్వాతంత్ర్యానికి గుర్తుగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం.. జవహర్ లాల్ నెహ్రూకు ఆ రాజదండాన్ని అందించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ రాజదండాన్ని మ్యూజియంలో ఒక వాకింగ్ స్టిక్‌గా ఉంచారని ధ్వజమెత్తారు.
చరిత్రను కాంగ్రెస్ పార్టీ బోగస్ అంటోందని అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిపై పునరాలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన పార్టీలు కాంగ్రెస్ కుటుంబ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిందని నడ్డా ఆరోపించారు.
కాగా, పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం వెనుక ఉద్దేశం తెలుసని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీన్ని విచారించేందుకు నిరాకరిస్తున్న ట్లు ధర్మాసనం తెలిపింది. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్‌సభ సెక్రెటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్ పేర్కొన్నారు.
రూ. 75 నాణెం విడుదల
ఇలా ఉండగా, కొత్త పార్లమెంట్ భవనం సందర్భంగా రూ.75 నాణేన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రూ. 75 నాణెంపై పార్లమెంట్ కాంప్లెక్స్, కొత్త పార్లమెంట్ భవనం చిత్రం ఉంటుంది. ఈ నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉంటుందని తెలుస్తోంది.
దీన్ని నాలుగు లోహాలతో తయారు చేయనున్నారు. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉంటాయి. పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం క్రింద 2023 అని రాసి ఉంటుంది. ఈ నాణెం బరువు 35 గ్రాములు ఉంటుందని సమాచారం. నాణేనికి ఒకవైపు అశోక స్తంభం ఉంటుందని.. దిగువన రూ.75 అని రాసి ఉంటుందని తెలుస్తోంది.