ఐఫా-2023లో ఉత్తమ నటుడిగా నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ అవార్డుల వేడుకకు యూఏఈ రాజధాని అబుదాబి వేదిక అయింది. బాలీవుడ్ తారల తళుకు బెలుకులు, నృత్య ప్రదర్శనల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఇరవై మూడవ ఐఫా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా హృతిక్ రోషన్ నిలిచాడు. విక్రమ్ వేద సినిమాకు గానూ హృతిక్ ఈ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ నటిగా అలియాభట్ ఎంపికైంది. గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకు ఈ అవార్డు వరించింది.
కాగా ఈ అవార్డుల ఫంక్షన్కు అలియా రాకపోవడంతో ప్రముఖ నిర్మాత జయంతీలాల్ ఈ అవార్డును స్వీకరించాడు. ఉత్తమ చిత్రంగా దృశ్యం-2 నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ కమల్ హాసన్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారాన్ని అందుకున్నాడు.