శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 ప్రయోగం విజయవంతం అయింది. సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు కాగా, బరువు 420 టన్నులు.
ఈ వాహకనౌక 2232 కిలోల బరువున్న నావిక్ ఉపగ్రహం ఎన్వీఎస్-01 నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. దీని ఉపగ్రహం జీవితకాలం 12 ఏళ్లని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందించనుంది ఈ ఉప్రగ్రహం.
ఇండియన్ రీజనల్ నేవిగేషన్ సిస్టమ్ ని రూపొందించుకునే ప్రయత్నం ఈ ప్రయోగం కీలకం కానుంది. అందుకే ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఎ నుంచి ఇప్పటి వరకూ మొత్తం 9 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది ఇస్రో. 2013-2018 మధ్య మొత్తం 9 ఉపగ్రహ ప్రయోగాల్లో ఏడు విజయవంతం అయ్యాయి. వీటిల్లో కొన్నింటికి కాలపరిమితి తీరిపోయింది.
మరికొన్ని ఉపగ్రహాల పనితీరు సరిగా లేకపోవడంతో ఎన్వీఎస్ -01 ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇస్రో. ఐఆర్ఎన్ఎస్ఎస్ -1జి స్థానంలో ఎన్వీఎస్ -01 సేవలందించేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఎన్వీఎస్ -01 ఇకపై పూర్తి స్థాయిలో సేవలందించనుంది. భారత నేవిగేషన్ వ్యవస్థకు ఈ ప్రయోగం చాలా కీలకమని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
భారత సరిహద్దుల్లోని 1500 కిలో మీటర్ల మేర ఈ నావిగేషన్ కవరేజ్ ఉండే విధంగా ఇస్రో రూపొందించింది. ఈ శాటిలైట్ ప్రయోగం విజయవంతమైంది కాబట్టి 12 సంవత్సరాల పాటు దీని సేవలు వినియోగించుకోవచ్చని సోమనాథ్ తెలిపారు. నేవిగేషన్ వ్యవస్థ కోసం ఐదు కొత్త ఉపగ్రహాలు రూపొందించాలని పేర్కొంది.
వీటిల్లో ఒకటి విజయవంతం కావడంతో మరో నాలుగు ఉపగ్రహాల ప్రయోగాలు ఆరు నెలల గ్యాప్ తో నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇండియన్ నేవిగేషన్ వ్యవస్థాలో భాగంగా… సాయుధ దళాలు, పౌర విమానయాన రంగానికి మెరుగైన పొజిషనింగ్, నేవిగేషన్ అండ్ టైమింగ్ కోసం వీటిని ఇస్రో రూపొందిస్తుంది. రెండో తరం నేవిగేషన్ శాటిలైట్ సిరీస్‌లలో ఎన్వీఎస్ -01 మొదటిది. ఎల్ఐ బ్యాండ్‌లో కొత్త సేవలను కూడా ఈ శాటిలైట్ అందించనుంది.