మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టులో ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.
మరో వైపు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కూడా హైకోర్టు షరతు విధించింది. విచారణకు సహకరించాలని హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించేలా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ఈనెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పూర్తిస్థాయిలో విచారించి తుది ఉత్తర్వులివ్వాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. ఈ పిటిషన్ పై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈనెల 25న ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈనెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. అన్ని వర్గాల వాదనలను హైకోర్టు విన్నది. ఈనెల 31న తుది తీర్పును వెల్లడించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తెలిపింది. బుధవారం పదిన్నర గంటలకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించింది.
మరోవైపు వివేకా కూతురు సునీత హైకోర్టులో మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, దీంతో ఆమెను అవినాశ్ దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని బెయిల్ గత వారం వాదనల సందర్భంగా కోర్టుకు అవినాశ్ లాయర్ తెలిపారు.
అవినాశ్ కు బెయిల్ ఇవ్వాలని, అవినాశ్ తల్లి అనారోగ్యం విషయంలో తాము తప్పు చెపితే తమపై చర్యలు తీసుకోవచ్చని కోర్టుకు తెలిపారు.ఈ క్రమంలో సునీత మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని, అవినాశ్ పై చర్యలు తీసుకోవాలని మెమోలో ఆమె కోరారు.
అయితే ఆమె మెమోను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు హైకోర్టు బెయిల్ ఆర్డర్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసే అవకాశం ఉంది.