విజయవాడ నుండి రెండు సార్లు టిడిపి ఎంపీగా గెలుపొందిన కేశినేని నాని ఇప్పుడు వైసిపి వైపు చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఆయన మాటలు, చేతలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. రెండోసారి గెలిచినప్పటి నుండి టిడిపి నాయకత్వం పట్ల ధిక్కార ధోరణి ఆవలంభిస్తుండటం, నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడంతో ఆయనకు వచ్చే ఎన్నికలలో పార్టీ సీట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది.
పైగా, ఆయన తమ్ముడు చిన్ని ఆయనకు వ్యతిరేకంగా మారి, టిడిపిలో క్రియాశీలకంగా ఒంటి పార్టీ సీట్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ సీట్ ఇస్తే పోటీ చేస్తా, లేకుంటే ఇంట్లో కూర్చుంటా అంటూ వచ్చిన ఆయన ఇప్పుడు మాట మార్చారు. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమోనని చెబుతూ తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అంటూ వైసిపిలో చేరేందుకు సిద్దమనే సంకేతం ఇచ్చారు.
ఇదే సమయంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వైసీపీలోకి కేశినేని నాని వస్తానంటే స్వాగతిస్తామని చెబుతూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. మరోవంక గత వారం నందిగామ నియోజకవర్గంలో, బుధవారం మైలవరం నియోజకవర్గంలో స్థానిక వైసిపి ఎమ్యెల్యేలతో వేదికలు పంచుకొంటూ, వారిని ప్రశంసలతో ముంచెత్తారు.
రాజకీయాలు ఎన్నికల వరకే అంటూ, అభివృద్ధి కార్యక్రమాలలో ఏపార్టీ వారైనా తనకు అభ్యంతరం లేదంటూ చెప్పారు. నాని వైసిపి ఎమ్యెల్యేలతో కలసి వేదికలు పంచుకోవడం స్థానిక టిడిపి నేతలకు కంటగింపుగా మారింది. నందిగామలో ఈ విషయమై కొందరు పార్టీ అధిష్ఠానంపై ఫిర్యాదు చేయడంతో పాటు, సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు కూడా పెడుతున్నారు.
2019 ఎన్నికల తర్వాత అవకావశం దొరికినప్పుడల్లా టీడీపీ పై నాని విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీలో తనకు కట్టబెట్టిన పదవులు కూడా వద్దని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నానికి ఇతర నేతలకు మధ్య ఉన్న విబేధాలు మరింత బహిర్గతమయ్యాయి.
కేశినేని నాని చంద్రబాబు ర్యాలీలో పాల్గొంటే తాము దూరంగా ఉంటామని బుద్దా వెంకన్న ప్రకటించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇతర టీడీపీ నేతలతో కూడ నానికి మధ్య గ్యాప్ పెరిగింది.