డార్క్ వెబ్ ఇంటర్నెట్ వేదికగా పాన్ ఇండియా స్థాయిలో జరుగుతోన్న భారీ డ్రగ్ ట్రాఫికింగ్‌ను మంగళవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) చేధించింది. ఈ ఆపరేషన్ ద్వారా 15,000 బ్లాట్స్ల ఎల్ఎస్డిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాల్లో ఒకే ఆపరేషన్‌లో భారీ మొత్తంలో ఎల్ఎస్డిని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని తెలిపారు.
ఎల్ఎస్డి (లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్) ఓ రసాయనిక డ్రగ్ పదార్థం. పక్కా ప్రణాళికతో ఓ ప్రైవేట్ మెసేజింగ్ యాప్ వికర్ మి ద్వారా యువతను టార్గెట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారా డ్రగ్స్ కావాలా అని అడుగుతారని, ఆసక్తి కనబరిచిన వారికి వెంటనే వికర్ మితో అనుసంధానం చేస్తారని పేర్కొన్నారు.
డార్క్ వెబ్‌లో ప్రకటనలతో ఇన్‌స్టాగ్రామ్‌లో యువతను రీచ్ అవుతున్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు జరుగుతున్నాయని, పాన్ ఇండియా స్థాయిలో ఈ నెట్వర్క్ పనిచేస్తోందని చెప్పారు. ఎల్ఎస్డిని ఎక్కువగా పోలాండ్, నెదర్లాండ్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఎల్ఎస్డి వాణిజ్య పరిమాణం 0.1 గ్రాములని, ఎన్‌సిబి దాడిలో పట్టుబడిన 15 వేల ఎల్ఎస్డి బ్లాట్లు… దాని వాణిజ్య పరిమాణం కంటే 2,500 రెట్లు ఎక్కువని వెల్లడించారు. ఒక బ్లాట్.. చిన్న పేపర్ ముక్క పరిమాణంలో ఉంటుందని చెప్పారు. ఈ కేసులో వివిధ నగరాల నుండి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పారు. ఈ నెట్వర్క్ కీలక వ్యక్తిని జైపూర్‌లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఆర్థికంగా చూసినపుడు ప్రస్తుతం పట్టుబడిన మాదక ద్రవ్యం చాలా ఎక్కువ అని చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఇరాన్‌లోని చాబహార్ పోర్టు గుండా ఈ మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు తెలిపారు.
పాకిస్థాన్ జాతీయుడు జుబెయిర్ నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. పాకిస్థాన్‌లోని ట్రాఫికర్ తనకు పెద్ద మొత్తంలో సొమ్మును ఆశచూపించడంతో తాను ఈ నేరానికి పాల్పడినట్లు స్వచ్ఛందంగా అంగీకరించాడని చెప్పారు.