మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో మంగళవారం ఏకబిగిన ఎనిమిది గంటల పాటు మార్గదర్శి ఎండి శైలజాకిరణ్‌ను ఏపీ సిఐడి అధికారుల బృందం ప్రశ్నించింది. నిధులు మళ్లింపుపైనే ప్రధానంగా దృష్టి సారించింది. సీఐడీ ఎస్పీలు అమిత్ బర్దర్, హర్షవర్థన్‌రాజు, విచారణ అధికారి రవికుమార్‌తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శైలజ నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు.
మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ హోదాలో చెక్ పవర్ కూడా ఉండటంతో నిధుల మళ్లింపుపై ఆధారాలు చూపించి, వాటిపై సమాధానాలు కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు సిఐడి విచారణ సందర్భంగా తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేసినట్లు తెలుస్తోంది.
విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వడంతో ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పడంతో సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలిందని, బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారనే దానిపై తాజా దర్యాప్తు కొనసాగింది.
రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి అనుమానిస్తోంది. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్‌ను ప్రశ్నించడంతో ఆమె సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు మాత్రమే తెలిపారు.
నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారని సిఐడి వర్గాలు చెబుతున్నాయి.
చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ విచారణ నుంచి తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. విచారణకు శైలజా కిరణ్ పూర్తిగా సహకరించక పోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది.