అధిక వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థల వృద్థి దెబ్బతిననుందని ప్రపంచ బ్యాంక్ విశ్లేషించింది. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 2.1 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. 2022లో 3.1 శాతం వృద్ధి చోటు చేసుకుంది. 189 దేశాలు సభ్యత్వం కలిగిన ప్రపంచ బ్యాంక్ తన తాజా గ్లోబల్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్‌లో పలు దేశాలు వరుసగా పెంచుతున్న వడ్డీ రేట్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ రిపోర్ట్ ప్రకారం హెచ్చు వడ్డీ రేట్లకు తోడు ఉక్రెయిన్, రష్యాలోని ఆందోళన పరిణామాలు, కరోనా వైరస్ మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉందని విశ్లేషించింది. 2022లో 3.1 శాతం పెరిగిన ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత ఏడాదిలో 2.1 శాతం మాత్రమే విస్తరించవచ్చని అంచనా వేసింది.
అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్, ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇది మహమ్మారి మాంద్యం, నిరంతర సరఫరా కొరత, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చిత్తి, ఆహార ధరల షాక్‌ల నుండి ఊహించిన దానికంటే ఆర్థిక వ్యవస్థ కొంత బలంగా పుంజుకుంటునప్పటికీ ఆందోళకరమేనని పేర్కొంది.
అధిక రుణ వ్యయాల వల్ల ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత పెరుగుతోందని తెలిపింది. వచ్చే ఏడాది 2024లో 2.4 శాతం వృద్థి చోటు చేసుకోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యతన జరుగుతున్న ఈ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్8న ముగియ నుంది. ఇందులో కీలక వడ్డీ రేట్ల మార్పునపై నిర్ణయం తీసుకోనున్నారు.
గత ఏప్రిల్‌లో జరిగిన సమీక్షీలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచారు. అంతక్రితం 2022 మే నుంచి వరుసగా రెపోరేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. దీంతో రుణ గ్రహీతలపై అదనంగా 2.5 శాతం వడ్డీ భారం పడింది.