టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న సిట్ ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితుల వివరాలను ఇందులో పేర్కొంది. 98 పేజీల చార్జ్‌షీట్‌లో 49 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రస్తావించింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టు సిట్ వివరించింది. న్యూజిలాండ్‌లో ఉన్న ఒక నిందితుడు మినహా 49 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అరెస్ట్ అయిన వారిలో 16 మంది దళారులు కాగా మిగతా వాళ్లు వివిధ పరీక్షలు రాసిన వారిగా తెలిపింది.
ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్ 8మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ నలుగురికి చేరినట్లు గుర్తించినట్లు ప్రకటించింది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతుల మారిన నగదు వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయిన వారిలో ఇందులో 15 మంది నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారని సిట్ తెలిపింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులంతా జైల్లోనే ఉన్నారని… పూల రమేషే హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించినట్లుగా గుర్తించినట్లు ప్రస్తావించింది.
ఏఈ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 80 మందికి పూల రమేష్ విక్రయించాడని… అతను నుంచి రాబట్టిన కీలక సమాచారంతో అరెస్ట్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉందని చెప్పుకొచ్చింది.