జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుండి తలపెట్టిన వరాహ యాత్ర మార్గంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ యాత్ర సాగే కోనసీమ జిల్లాలో సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసులు ప్రకటన జారీ చేశారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఆంక్షలపై జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. జనసేన యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే పోలీసులు ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 28 వరకు వపన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
అమలాపురంలో దాదాపు మూడు నెలల కిందట ఎత్తేసిన సెక్షన్ 3ను ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు విధించారన్న దానిపై స్థానికంగా చర్చ మొదలైంది. జూన్ 14 నుంచి ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ యాత్రంలో ఐదు బహిరంగ సభలలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
జూన్ 14న ప్రత్తిపాడు కత్తిపూడి జంక్షన్, జూన్ 16న పిఠాపురం ఉప్పాడ జంక్షన్, జూన్ 18న కాకినాడ సర్పవరం జంక్షన్, జూన్ 21న అమలాపురం గడియార స్తంభం సెంటర్, జూన్ 22న రాజోలు మల్కిపురం సెంటర్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వారాహి యాత్రకు ఏర్పాట్లు చేశారు జనసేన నేతలు.
ఎన్ని ఆంక్షలు విధించినా వారాహి యాత్ర జరిగి తీరుతుందని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసుల తీరుపై జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. పవన్ కల్యాణ్ యాత్ర సమయంలోనే శాంతి భద్రతలు గుర్తుకొస్తాయా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో భేటీ కానున్నారు.
కాకినాడ సబ్ డివిజన్‌తో పాటు పెద్దాపురం, అమలాపురం పరిధిలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షలపై జనసేన నేతలతో పవన్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.