బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని వీరి ఇల్లు, ఆఫీసుల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి.
ఏకంగా 70 ప్రత్యేక బృందాలు ఈ సోదాలను జరుపుతున్నట్టు సమాచారం. శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తుండగా దానికి సంబంధించిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారుల సోదాలు జరుగుతున్నాయి.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. కూకట్ పల్లిలోని జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో కూడా ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.
గతంలో బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలపై ఐటీ సోదాలు సంచలనం సృష్టించింది. మంత్రి మల్లారెడ్డిపై సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలతో పాటు ఆయన కుమారుడు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఫలింతగా ఆయన ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల్లో కూడా ఈ సోదాలు జరగటమే కాదు… ఢిల్లీకి వెళ్లి విచారణకు హాజరయ్యారు.