ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామిరెడ్డితోపాటు పీకే అయ్యర్, డీసీ ఆడిటర్ మణి ఊమెన్లను కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నది.
కెనరా బ్యాంకు, ఐడీబీఏ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసిన మోసం కేసులో ఈడీ బుధవారం అరెస్టులు చేసింది.
పలు బ్యాంకులు నుంచి రూ.8800 కోట్ల రుణాలను వెంకట్రామిరెడ్డి గతంలో తీసుకున్నారు. ఈ రుణాలు తిరిగి చెల్లించకుండా ఎగవేసినందుకు గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేయగా, ఆయన షరుతలతో కూడిన బెయిల్‌పై అప్పట్లో బయటకొచ్చారు.
అయితే సిబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి గత కొంతకాలంగా విచారణ చేపడుతోంది. అందులో భాగంగా వెంకటరామిరెడ్డితో పాటు మరో ఇద్దరినీ ఈడీ అధికారులు తాజాగా విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. గతంలోని డీసీకి చెందిన రూ 264 కోట్ల విలువ గల 3300పైచిలుకు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్‌కు చెందిన 14 ఆస్తులను అటాచ్ చేసింది. డెక్కన్ క్రానికల్ స్కామ్‌పై ఈడీ ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను పెద్ద మొత్తంలో దారి మళ్లించినట్లుగా అభియోగాలు నమోదు చేసింది. హవాలా, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో డీసీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
