ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతాడో చూస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన `వారాహి విజయ యాత్ర’ను ప్రారంభించిన సందర్భంగా కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రజల్ని విభజించి పాలన చేస్తుందని విమర్శించారు.
తాను పార్టీని నడపడానికి సినిమాలు చేస్తున్నానని, తన వద్ద అక్రమ ఆస్తులను లేవని స్పష్టం చేశారు. తన బిడ్డల కోసం దాచిన డబ్బులతో పార్టీని ప్రారంభించానని చెబుతూ ప్రజల్నే తన బిడ్డలుగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ సినిమాలను అడ్డుకుంటూ, సినిమా టికెట్ల రేట్లు తగ్గించి క్లాస్ వార్ చేస్తుంది సీఎం జగన్ అని విమర్శించారు. జనసేన ఆంధ్ర నుంచే రాజకీయాలు చేస్తుందని పేర్కొంటూ పొత్తులపై ఇంకా ఆలోచించలేదని, ఒంటరిగా వెళ్లాలో, ఉమ్మడిగా వెళ్లాలో నిర్ణయించుకున్న రోజు కుండ బద్దలు కొట్టి చెప్తానని వెల్లడించారు.
“వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెడతాను. దానికోసం ఎన్ని వ్యూహాలైన వేస్తాను. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాను. చేగువేరా, నేతాజీ, భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. చేగువేరా పుట్టిన రోజు నాడే వారాహిపై తొలి సభలో ప్రసంగించడం ఆనందంగా ఉంది” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
సామాన్యులు అవినీతి చేస్తే ఏసీబీ, సీబీఐ ఉన్నాయి. సీఎం అవినీతి చేస్తే పట్టుకునేవాళ్లు ఎవరు? అని ప్రశ్నించారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తులతో పోరాటం చేస్తున్నట్లు తెలుపుతూ తనను పాలించే వ్యక్తి తన కంటే నిజాయితీ కలిగి ఉండాలనేది తన కోరిక అని తెలిపారు. సీఎం అవినీతిని మనమనందరం ప్రశ్నించాలని పిలుపిచ్చారు.
ఉచ్ఛం నీచం లేకుండా సీఎం సహా వైసీపీ నేతలు తనను తిడుతున్నారని పవన్ మండిపడ్డాయిరు. దేశంలోనే అత్యధిక పారితోషికాలు తీసుకొనే నటుల్లో తాను ఒకడినని, అలాంటప్పుడు తానేందుకు ఆ మాటలు పడాలని ప్రశ్నించారు. ప్రజల కోసం ఏం చేయకపోతే తప్పు అవుతుందని, తన మనసు తట్టుకోలేక మీకోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎంత నీచంగా మాట్లాడినా తాను భరిస్తానని పవన్ తెలిపారు.
పరిపాలించేవాళ్లు నిజాయితీపరుడై ఉండాలని, నాయకులు బాధ్యతగా లేనప్పుడు కచ్చితంగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. దోపిడీ, అవినీతిపరులతోనే తన పోరాటమని పవన్ పేర్కొంటూ ఏపీలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని వైపీపీపై విమర్శలు చేశారు. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన వైసీపీ, జనసేనను టార్గెట్ చేస్తోందంటే పార్టీ ఎంత బలంగా ఉందో అర్థమౌతోందని పవన్ ఎద్దేవా చేశారు.