ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదని జమ్మూ-కశ్మీరులోని ముగ్గురు అక్కచెల్లెళ్లు నిరూపించారు. వీరు తొలి ప్రయత్నంలోనే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో విజయం సాధించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ కఠినమైన పరీక్షలో వీరు చెప్పుకోదగ్గ మార్కులు సంపాదించారు. ఈ కజిన్ సిస్టర్స్ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు కావడం గమనార్హం.
టుబ బషీర్, రుట్బా బషీర్, అర్బిష్ కజిన్ సిస్టర్స్. వీరు శ్రీనగర్ సమీపంలోని నౌషీరాకు చెందినవారు. వీరు శ్రీనగర్‌లోని ఇస్లామియా హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివారు. కశ్మీరు లోయలో తిరుగుబాట్లు, ఉగ్రవాదం వల్ల విపరీతమైన సమస్యలు ఎదురైనప్పటికీ వీరు మొక్కవోని దీక్షతో చదివారు.
తల్లిదండ్రుల సహకారం, సరైన శిక్షణ వల్ల వీరు నీట్ పరీక్షలో విజయం సాధించారు. అర్బిష్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో వైద్యులు లేరన్నారు. అందుకే తాను వైద్యురాలిని కావాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పారు.
ఇదే మొదటి, చివరి ప్రయత్నమని భావించి తాను నీట్ పరీక్ష కోసం సిద్ధమయ్యానని చెప్పారు. తన తల్లిదండ్రులు తనకు మొదటి నుంచి బాగా సహకరించారని తెలిపారు. టుబ బషీర్ మాట్లాడుతూ, తాము ముగ్గురం నీట్ పరీక్షలో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
తాము కలిసికట్టుగా పాఠశాలకు, కోచింగ్ సెంటర్‌కు వెళ్లేవారమని తెలిపారు. ఎంబీబీఎస్ చదివి డాక్టర్లవాలని కోరుకున్నామని చెప్పారు. చాలా శ్రమపడి, ఫలితం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు.
రుట్బ మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు తమను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించారని తెలిపారు. 11వ తరగతి నుంచి తాము నీట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. చాలా అభ్యాసం చేశామని చెబుతూ తాము విజయం సాధించడానికి కారణం తమ తల్లిదండ్రులేనని చెప్పారు.
