తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రానున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన విశాఖపట్టణం, తిరుపతి రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ రూట్లో ట్రయల్ రన్ పూర్తి కాగా, సాధారణ కార్యకలాపాలకు అనువుంగా ఉందని రైల్వే శాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ వందేభారత్ రైలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరాన్ని హైదరాబాద్ నగరంతో అనుసంధానం చేస్తుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ కాలం మరింత తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు పట్టణాలకు హైదరాబాద్‌తో కనెక్ట్ చేయడం వల్ల ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ కాలం రెండు గంటలు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే నాగ్‌పూర్ వందేభారత్ రైలు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు ఈ రైలు సదుపాయం కలసి వస్తుందని భావిస్తున్నారు.
ఇక రానున్న కాలంలో హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు నగరాలకు వందేభారత్ ట్రైన్స్ నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. కాగా, సికింద్రాబాద్-పూణే శతాబ్ధి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో సికింద్రాబాద్-పూణే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మార్చాలని కేంద్రం పరిశీలిస్తోంది.
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పూణే వరకు పరిమిత స్టాప్‌లతో 8.25 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.ఈ మార్గంలో వందేభారత్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు అధునాతన సేవలను అందించాలని భారతీయ రైల్వే శాఖ భావిస్తోందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి.