ప్రస్తుతం జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బలంగా ఉందని, అధికారం నుంచి పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది చెబుతూ ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ “నాకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.
వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో ఉభయగోదావరి జిల్లాల పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే అని చెబుతూ, అయితే భయపెట్టే కొలది తాను మరింత రాటు దేలుతానని స్పష్టం చేశారు.
వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా చూసేందుకు జనసేన పార్టీ ప్రణాళిక ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. బలమైన సిద్ధాంతమే మనందరినీ కలిపిందని పేర్కొంటూ తన తరపు ప్రతినిధులుగా ప్రజల్లోకి వెళ్లి పని చేయాలని సూచించారు. త్యాగంతో కూడిన బాధ్యత గల నాయకులుగా ఎదగాలని చెప్పారు. గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కొద్దని… ఆ దిశగా మనమంతా పని చేయాలని దిశానిర్ధేశం చేశారు.
“ఘోరమైన ఓటమి తర్వాత కూడా నేను నిలబడి ఉన్నానంటే వారికి (ప్రజలకు) ఏదైనా మేలు చేయాలన్న బలమైన సంకల్పమే ముందుకు నడిపిస్తోంది. నాకు డబ్బు వ్యామోహం లేదు. డబ్బు మనిషిగా మారితే పోరాట బలం పోతుందని బలంగా నమ్మేవాడిని. పీడితుల కోసం బలమైన భావజాలం ఉండాలని, అది నిర్దుష్టంగా ఉండాలని నమ్మే వ్యక్తిని” అని జనసేన అధినేత తెలిపారు.
పార్టీ కోసం నిత్యం వేలాది మంది పనిచేస్తున్నారని చెబుతూ జనసేన పార్టీకి కోట్లాది మంది మద్దతు ఉందని చెప్పారు. “అందరినీ నేను కలవకపోవచ్చు. మీరు మాత్రం నా ప్రతినిధులుగా వారిని కలవండి. ప్రజల కష్టాలను వినే నాయకుడే భవిష్యత్తులో బలంగా మారతాడు. నన్ను చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయి నుంచి, మిమ్మిల్ని చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకురావాలి” అని కోరారు.