కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. విశాఖపట్నంలో ఔట్ డోర్ షూటింగ్ పూర్తి చేసుకొని, వారం క్రితం హైదరాబాద్ వచ్చాక రాకేశ్ మాస్టర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.
ఆయన రక్త విరేచనాలు చేసుకొని ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆదివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ సాయంత్రం అయిదు గంటలకు రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. తీవ్రమైన మెటాబాలిక్ ఎసిడోసిన్ కావటంతో ఆయన శరీరంలోని కొన్ని అవయవాలు ఫెయిల్ అయ్యాయని, చివరి నిమిషంలో ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆట అనే డ్యాన్స్ షో ద్వారా రాకేశ్ మాస్టర్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ‘ఢీ’ షోలో చేశారు. అనంతరం ఆయనకు సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. చాలా సూపర్ హిట్ పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. పెద్ద హీరోల మూవీలకు పని చేశారు.
1968లో తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మాస్టర్‌గా తెలుగులో 1500కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న శేఖర్, జానీ, సత్య మాస్టర్స్ ఆయన శిష్యులే.
రాకేశ్ మాస్టర్ కొంత కాలంగా సినిమాలకు ఎక్కువగా పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో కొన్ని చానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చేవారు.
ఆ ఇంటర్వ్యూలలో ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారేవి. సోషల్ మీడియాలో ఆయన బాగా పాపులర్ అయ్యారు. చాలాసార్లు ట్రోలింగ్‌కు సైతం గురయ్యే వారు. రాకేశ్ మాస్టర్ మృతి పట్ల సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.