న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు బెంజిమిన్ నెతన్యాహు నేతృత్వంలోని పచ్చి ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర న్యాయ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ అంతటా మళ్లీ నిరసనలు హౌరెత్తాయి. అప్రజాస్వామికమైన ఈ న్యాయ సంస్కరణలపై ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ప్రతిష్టంభనలో పడిన కొద్ది రోజులకే టెల్ అవీవ్‌తో సహా అన్ని ముఖ్య పట్టణాలు నిరసనలతో అట్టుడికిపోయాయి.
కరడుగట్టిన మితవాది బెంజిమిన్ నెతన్యాహు న్యాయమూర్తుల ఎంపిక అధికారం ప్రభుత్వానికే ఉండాలని పట్టుబడుతున్నారు అంతేకాదు, న్యాయ వ్యవస్థ అధికారాలకు కత్తెర వేసే పలు ప్రతిపాదనలను ఈ బిల్లులో పొందుపరిచారు. ఇజ్రాయిలీ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసేలా ఈ సంస్కరణలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి.
న్యాయ సంస్కరణలపై నిరసనలు వెల్లువెత్తుతుండడంతో దీనిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని, ఇంతవరకు ఈ బిల్లును పక్కన పెడుతున్నామని గత మార్చిలో నెతన్యాహు ప్రకటించారు. ఈ వినాశకర సంస్కరణలపౖౖె అధ్యక్షుడు ఐసాక్ హెరోజ్ ప్రతిపక్షాలతో చర్చలు జరిపారు.
బుధవారం ప్రతిపక్ష నాయకులు యాయిర్ లాపిడ్, బెన్నీ గాంట్జ్ ఈ చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటూ, తాము వీటి నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. ఆ మరు క్షణం నుంచే వివాదాస్పద న్యాయ సంస్కరణలకు పూర్తిగా స్వస్తి పలకాలంటూ టెల్ అవీవ్‌లో భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. నెతన్యాహు ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తున్నారు, తాము ఆయన ఆటలు సాగనివ్వం అని అమీ బ్లూజర్ అన్నారు.
అన్ని బిల్లులు (న్యాయ సంస్కరణల్లోని వివిధ నిబంధనలు) ఎప్పుడైనా పేలడానికి సిద్ధంగా ఉన్న బులెట్లలా ఉన్నాయి. వీటిని మార్చకపోతే ఇజ్రాయిల్ ప్రజాస్వామ్యానికి మనుగడే ఉండదు అని టెల్ అవీవ్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. ఈ బిల్లును ఎలాగైనా పార్లమెంటు ఆమోదం పొందేలా చూస్తామని దీని రూపకర్తల్లో ఒకరైన న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ చెప్పారు.
ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య అధికారాల సమతుల్యత కోసమే ఈ మార్పులు అని నెతన్యాహు ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. అయితే, ప్రభుత్వ వాదనలో డొల్లతనాన్ని ప్రతిపక్షాలు, న్యాయ నిపుణులు ఎత్తి చూపుతూ, ఈ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.