సిక్కింను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఉత్తర సిక్కిం జిల్లాలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను ఆర్మీ రక్షించినట్లు అధికారులు తెలిపారు. స్టైకింగ్, లయన్ డివిజన్, త్రిశక్తి కార్ప్స్ దళాలు ఆదివారం ఉత్తర సిక్కింలోని చుంగ్తాంగ్ వద్ద చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను రాష్ట్ర రాజధాని గ్యాంగ్ టక్ వైపు తరలించడానికి తాత్కాలిక వంతెనను దాటడానికి సహాయం చేసినట్లు తెలిపారు.
గురువారం నుండి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పెంగాంగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురవడంతో పాటు కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో లెచెన్, లచుంగ్ ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
దీంతో పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1500 మంది పర్యటకులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి తరలించారని, వారికి భోజన, వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సుమారు 3,500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని, వారిలో దేశీయ, విదేశీయ పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
చెన్నైలో భారీ వర్షం
కాగా, తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంతోపాటు శివారు ప్రాంతాలలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా అంతర్జాతీయ విమానాశ్రంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
దోహ, దుబాయ్తోసహా ఇక్కడకు వచ్చే 10 అందర్జాతీయ విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. అదేవిధంగా ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన విమానాల సర్వీసులు రద్దయ్యాయి. గత కొద్ది రోజులుగా సూర్యుడి ప్రతాపానికి అల్లాడుతున్న చెన్నైవాసులకు ఈ భారీ వర్షం ఊరటనిచ్చింది.
నగరంతోపాటు పొరుగున్న ఉన్న చెంగల్పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, వెల్లూరు, రాణిపేట్ జిల్లాలలో సైతం భారీ వర్షం కురవడంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చెన్నైతోపాటు పరిసర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.