చైనా, అమెరికా మధ్య మాటల యుద్ధం నువ్వంటే నువ్వనే తీవ్రస్థాయి విమర్శలు జోరందుకున్నాయి. చైనా అధినేత జి జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షులు జో బైడెన్ నియంత అని తిట్టిపోశారు. దీనిపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది. ఇటువంటి వ్యాఖ్యలు పరమచెత్తగా ఉన్నాయని, బాధ్యతారాహిత్యం అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు.
ఓ వైపు బైడెన్ ఆదేశాలతోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇటీవలే చైనాలో పర్యటించారు. జిన్‌పింగ్‌ను కలిశారు. చైనా అమెరికా మధ్య కీలక విషయాలల్లో సర్దుబాట్లు కుదిరాయని జిన్‌పింగ్ ఈ దశలో తెలిపారు. అయితే జిన్‌పింగ్‌ను బైడెన్ డిక్టెటర్‌గా పేర్కొనడం తిరిగి ఇరుదేశాల నడుమ పరస్పర వివాదం మరింతగా రగులుకుంది.
బైడెన్ ఇటీవలే కాలిఫోర్నియాలో ఓ సభలో మాట్లాడుతూ చైనా అధినేతను తిట్టిపోశారు. దీనిపై చైనా ప్రతినిధి స్పందిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు అనుచితం, రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. ఇదంతా కూడా కేవలం బైడెన్ తమ పార్టీకి నిధుల సేకరణల క్రమంలో చేసిన రాజకీయ చెత్త ప్రకటనగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.
బైడెన్ మాటల పట్ల తాము తీవ్ర అభ్యంతరం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని స్పష్టం చేశారు. బైడెన్ తమ సభలో మాట్లాడుతూ చైనా స్పైబెలూన్లను తాము కూల్చివేయడం నియంత అయిన జిన్‌పింగ్‌కు షాక్ తిన్పించిందని, చివరికి ఏమి జరిగిందో తెలియనంతగా కంగుతిన్నారని తెలిపారు. అయితే బ్లింకెన్ ఓ వైపు చైనాలో సంప్రదింపులకు వెళ్లినప్పుడే బైడెన్ ఈ స్పందనకు దిగడం కీలక అంశం అయింది.
బైడెన్ పదేపదే బెలూను గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని, కేవలం సవ్యమైన శాస్త్రీయ పరిశోధనలకు ఉద్ధేశించిందని, ప్రమాదవశాత్తూ దారితిప్ప ఉంటుంది, తరువాత పేలి ఉంటుందని, దీనిని బైడెన్ అనాలోచితంగా వేరే విధంగా మార్చి చైనాపై విమర్శలకు దిగడం అనుచితం అని మావో మింగ్ తెలిపారు.