ఆదిపురుష్ సినిమా విడుదలైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సినిమాలోని డైలాగుల విషయంలో, పాత్రలను మలిచిన తీరు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హనుమంతుడి పాత్రతో చిల్లర మాటలు అనిపించడంపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మూవీ మేకర్స్ హనుమంతుడి డైలాగులకు సవరణలు చేశారు.
మార్చిన డైలాగులతో ఉన్న వీడియో ట్విటర్లో చక్కెర్లు కొడుతున్నది. ఆదిపురుష్ సినిమా హిందీ వెర్షన్లో లంకా దహనం సందర్భంగా హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
‘కప్డా తేరీ బాప్ కా, తేల్ తేరీ బాప్ కా, అగ్ బీ తేరీ బాప్ కా, జలేగీ బీ తేరి బాప్ హై’ (వస్త్రం నీ అయ్యదే, నూనె నీ అయ్యదే, నిప్పు నీ అయ్యదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ అయ్యే) అని హనుమంతుడి చేత ఇంద్రజిత్తుకు చెప్పించడాన్ని పలువురు తప్పుపట్టారు.
దాంతో ఆ డైలాగులను ఇప్పుడు మార్చేశారు. ‘కప్డా తేరీ లంకా కా, తేల్ తేరీ లంకా కా, అగ్ బీ తేరీ లంకా కా, జలేగీ బీ తేరి లంకా హై’ (వస్త్రం నీ లంకదే, నూనె నీ లంకదే, నిప్పు నీ లంకదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ లంకే) అని సవరించారు. ఈ సవరించిన డైలాగులతో ఉన్న ఓ వీడియో ఇప్పుడు ట్విటర్లో చక్కెర్లు కొడుతోంది.