అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొనియాడారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో మేధా సర్వో డ్రైవ్స్, స్విస్ రైల్వే వెహికిల్స్ తయారీదారు స్టాడ్లర్ రైల్ సంయుక్తంగా స్థాపించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
దేశంలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయని, జీనోమ్ వ్యాలీలో మూడోవంతు వ్యాక్సినేషన్ ఇక్కడి నుంచే అందిస్తున్నామని పేర్కొన్నారు.
మేధా సంస్థ రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఫేజ్-1ను మొదలుపెట్టి, మాన్యుఫ్యాక్చరింగ్‌ను కూడా ఆరంభించిందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ఫ్యాక్టరీ మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. మేధా సంస్థకు అనుబంధంగా మలేషియన్ కంపెనీతోపాటు మరో నాలుగైదు దేశాల కంపెనీలు కూడా విడిభాగాలను తయారు చేసే పనులు చేస్తున్నాయని పేర్కొన్నారు.
పూరి రైల్వే కోచ్ ఇక్కడే తయారు చేసే నిమిత్తం మేధా సంస్థకు ముంబై మోనో రైల్ ప్రాజెక్టు రావడం గొప్ప విషయమని తెలిపారు. భవిష్యత్తులో ట్రైన్ మొత్తం ఇక్కడే తయారు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని, ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేస్తామని మేధా సంస్థ చెప్తున్నదని, వారి ఆత్మవిశ్వాసాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం చెప్పారు.
‘ఫ్యాక్టరీ అంతా కలియతిరిగి మేధా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాన్ని స్వయంగా చూశాను. ఇంతటి గొప్ప ఫలితాలను నేను ఊహించలేదు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. వరంగల్ ముద్దు బిడ్డలు మేధా గ్రూప్ ఎండి కశ్యప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిలు ఇంత పెద్ద వెంచర్‌తో వందలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు శుభాభినందనలు’ అంటూ కేసీఆర్ అభినందించారు.
ఈ పరిశ్రమకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమ ఇంకా విస్తరించి రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు.