ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది మే 31 వ తేది వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో భక్తులు శ్రీవారికి రూ.860 కోట్లకు పైగా విరాళాలు అందించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు.
176 పురాతన ఆలయాల పునరుద్దరణకు రూ.93 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ. 10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని, వీటిలో 1953 ఆలయాలను ఏపీ దేవాదాయ శాఖ, 320 ఆలయాలను సమరసత సేవా ఫౌండేషన్ నిర్మిస్తాయని ఆయన వివరించారు.
2018 ఆగస్టు 28 న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైందని, 2019 సెప్టెంబర్ 23 న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ.10,000 విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని తెలిపారు. టీటీడీ పరిపాలన పూర్తి పారదర్శకంగా నడుస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఆస్తులు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం డిపాజిట్ల పై శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు.
శ్రీవాణి నిధుల వినియోగంపై సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు స్వార్ద ప్రయోజనాల కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి నిధుల వ్యవహారం పై కొందరు పీఠాధిపతులు, వీహెచ్పీ నేతలు తనను కలిసినప్పుడు అన్ని పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్ మొత్తం వివరాలు చూపామని తెలిపారు.
ఈ వివరాల పై విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రాఘవులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసేముందు లక్షలాది మంది భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకోవాలని, ఇలాంటి వారి పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.