రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడని యెవ్జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూప్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేసింది. శనివారం ఉదయం జాతిని ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించిన కాసేపటికే వాగ్నర్ గ్రూప్ తన ప్రకటనను వెలువరించింది.
‘అతి త్వరలో మనం దేశానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది. రష్యాపై సొంత ప్రైవేటు మిలటరీ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ తిరుగుబాటు చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అనూహ్య తిరుగుబాటుపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు.
ప్రైవేటు సైన్యం తిరుగుబాటును కఠినంగా అణచివేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, వాగ్నర్ గ్రూప్ కూడా అంతే దీటుగా స్పందించింది. తమ దళాలు మాస్కో దిశగా దూసుకుపోతున్నాయని, పుతిన్ పెద్ద తప్పు చేశారని, త్వరలోనే రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తాడని వెల్లడించింది.
రష్యా లోని రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. రష్యా మిలటరీకి చెందిన మూడు హెలీకాప్టర్లను కూల్చేశామని తెలిపారు. తమకు రష్యా నేషనల్ గార్డ్స్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదన్నారు. తమ తదుపరి లక్ష్యం రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలదోయడమేనని స్పష్టం చేశారు.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ తిరుగుబాటు దారుణమైన వెన్నుపోటు, నమ్మకద్రోహం అని అభివర్ణించారు. ఆ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యాకు ద్రోహం చేశాడని ఆరోపించారు. ప్రిగోజిన్ వ్యక్తిగత స్వార్థం, స్వార్థ ప్రయోజనాలే ఈ నమ్మకద్రోహానికి కారణమని మండిపడ్డారు.
‘‘ఈ నమ్మకద్రోహానికి, మోసానికి పాల్పడిన వారు, వారికి సహకరించినవారు, ఈ తిరుగుబాటుకు ప్రణాళిక సిద్ధం చేసినవారు.. అందరికీ తగిన శిక్ష కచ్చితంగా పడుతుంది’’ అని హెచ్చరించారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ తో అత్యంత కఠినమైన యుద్ధం చేస్తోంది. పాశ్చాత్య దేశాలు తమ శక్తియుక్తులన్నీ ఒడ్డి మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాయి.
ఇదే సమయంలో సొంత మనుషులే ఈ తిరుగుబాటు చేసి, దేశానికి, దేశ ప్రజలకు ద్రోహం చేశారు. క్షమించరాని నేరం చేశారు. వారికి తగిన శిక్ష కచ్చితంగా ఉంటుందని పుతిన్ స్పష్టం చేశారు.