టమాటా ధర చూసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పది రోజుల క్రితం వరకు కేజీ టమాటా రూ.20 ఉండగా, క్రమక్రమంగా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.120కి చేరుకున్నాయి. రూ 80 నుండి రూ. 120 వరకు ధర చెల్లించవలసి వస్తున్నది.
టమాటా ధర వందకు చేరడం తో వాటిని కొనేందుకు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కేజీ తీసుకునే దగ్గర పావుకేజీ తీసుకొని సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు టమాటా వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు.
టమాటాలతో పాటు నిత్యం కూరల్లో ఉపయోగించే పచ్చిమిర్చి ధర భారీగా పెరిగింది. కేజీ రూ.40 లేదా రూ.60కి లభించే పచ్చిమిర్చి.. ఇప్పుడు రూ.120కి చేరుకుంది. దీంతో ప్రజలు పచ్చిమిర్చిని తక్కువ మొత్తంలోనే ఉపయోగిస్తున్నారు. మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలతో కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నాయి.
అనంతరం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయల దిగుబడి కూడా తగ్గిందని రైతులు చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది రైతులు టమాట పంట వేయడం కూడా చాలా తగ్గించారు.
తెలంగాణలో టామాట, పచ్చిమిర్చి పంట లేకపోవడంతో ఏపీలోని చిత్తూరు, మదనపల్లె, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి ఇక్కడకు వ్యాపారులు తెచ్చుకుంటున్నారు. దీంతో రవాణా ఛార్జీలు కూడా అధికం కావడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మిగిలిన కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి.