సినిమాల ప్రభావమో లేక అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మహిమో తెలీదుగానీ నేరగాళ్లు తెలివిమీరారు. పోలీసులకు చిక్కకుండా, ఆధారాలు లేకుండా తెలివిగా క్రైమ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు.
ఇలా అతితెలివితో గంజాయి స్మగ్మింగ్ చేస్తున్న ఓ గ్యాంగ్ ను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఓ స్మగ్లింగ్ ముఠా భారీగా గంజాయి విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
దీంతో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై రెండు వాహనాలను పట్టుకున్నారు. ఓ కారు డిక్కీలో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో వాహనంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉల్లిపాయల బస్తా కింద గంజాయి పెట్టి తరలించినా పోలీసులు గుర్తించారు.
గోనెసంచుల్లో 255 కిలోల గంజాయిని మూటగట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. అనుమానంతో ఉల్లిపాయల బస్తాలు తీసిచూసిన పోలీసులకు గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. దీంతో గంజాయి బస్తాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా రెండు వాహనాల్లో పట్టుబడిన 400కిలోల గంజాయి విలువ రూ.80 లక్షలపైనే వుంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఆరుగురు స్మగ్లర్లను విజయవాడ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.