తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 10 ప్రాంతంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వారం రోజుల క్రితం రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌పై సంకేతాలిచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
శాసన సభను రద్దుచేసి 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినపుడు ఆ ఏడాది నవంబర్ నెల 10వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. ఈ దఫా ఒక నెలముందే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలన్న యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.
శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణా విధుల్లో ఉండే అధికారుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.
సొంత జిల్లాల్లో పని చేయరాదని, మూడేళ్లకు మించి అక్కడే కొనసాగరాదని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా రెవెన్యూ, పోలీసు సహా ఇతర అధికారులు తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. దానితో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వంటి సీనియర్ అధికారులను బదిలీ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా.. మధ్యప్రదేశ్ గడువు జనవరి 6, మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్గడ్ గడువు జనవరి 3, రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.