ప్రపంచవ్యాప్తంగా 150 టాప్ యూనివర్సిటీలో భారత్‌కి చెందిన బాంబే ఐఐటి స్థానం దక్కించుకుంది. ఐఐటి బాంబే ప్రపంచవ్యాప్త యూనివర్సిటీల్లో నిలిచినందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు.
క్వాక్వెరెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకులనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 టాప్ యూనివర్సిటీలో భారత్‌కి చెందిన ఐఐటి బాంబే 149వ ర్యాంక్‌లో నిలిచింది. క్యూఎస్ ర్యాకింగ్ వెలువడిన అనంతరం ప్రపంచవ్యాప్త టాప్ యూనివర్సిటీల్లో ఐఐటి బాంబే చేరి మైలురాయిని సాధించిందని ఆ యూనివర్సిటీ బుధవారం అధికారిక ప్రకటన వెల్లడించింది.
ఇక ఈ విషయంపై కేంద్రమంత్రి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వరల్డ్ టాప్ యూనివర్సిటీల్లో ఐఐటి బాంబే ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఐఐటికి నా అభినందనలు. ఈ ర్యాంక్‌లు ఇచ్చే క్యూఎస్ వ్యవస్థాపకుడు న్యూనిజికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.
ఈ సంవత్సరం ర్యాంకింగ్ సిస్టమ్ కోసం 2,900 యూనివర్సిటీలకు ర్యాంక్స్ ఇచ్చారు. వీటిలో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు చేరడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ భారత్‌లో ఉన్న విద్యను మార్చారని, దీంతో ప్రపంచస్థాయి యూనివర్సిటీల్లో మన యూనివర్సిటీలు చేరాయని ఆయన తెలిపారు. ఇప్పుడు తక్కువ మంది భారతీయులే మెరుగైన విద్య కోసం విదేశాలకు వెళతారని చెప్పారు. భారతీయ విద్య మంచిది కాదు అని ఇప్పుడు అనలేమని, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమైనదని ఆయన స్పష్టం చేశారు.