గత సంవత్సరం జూలైలో పోలవరం ముంపుతో భద్రాచచలం పరిసర ప్రాంతాలు ముంపుకు గురైన విషాద సంఘటన మరవకముందే వర్షాకాలం రావడంతో మరోసారి ఆ ప్రాంత ప్రజలు ముప్పు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఉన్న ఆంధ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
సీడబ్ల్యూసీ, ఆదేశించినా, న్యాయస్థానం మందలించినా ఏపీ ఏమాత్రం స్పందించకపోవడంతో తిరిగి వర్షకాలంలో ముంపు తప్పదనే భావనలో అక్కడి ప్రజలు, నీటిపారుదల శాఖ ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్లుతున్నట్లు సమాచారం.
పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ సంయుక్తంగా ముంపు సర్వే చేయాలని తెలంగాణ చేస్తున్నడిమాండ్ ను ఏపీప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తెలంగాణ తీవ్రంగా స్పందిస్తోంది. మరోసారి న్యాయస్థానానికి వెళ్లి ఏపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్ధమైంది.
ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటుగా తిరిగి వరదలు వస్తే జరిగే నష్టాన్ని అంచనా వేస్తూ సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేయాలని తెంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కొద్ది నెలల క్రితం పోలవరం ముంపు నష్టాలను అరికట్టాలని కోరుతూ ఒడిషా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సరిహద్దు రాష్ట్రాలు ఏకాభిప్రాయం సాధించాలని సూచించడంతో సీడబ్ల్యూసీ రెండు పర్యాయాలు సంబంధింత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని తేదీలు నిర్ణయించినా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశానికి రాకపోవడంతో ఏకాభిప్రాయం రాలేదు.
అలాగే ఉమ్మడి సర్వేకు తేదీలు నిర్ణయించినా ఆంధ్ర నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కానీ, పీపీఏ నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వర్షాలు కురిసి వరదలు వస్తే తిరిగి తెలంగాణ భూభాగంలో పోలవరం ముంచెత్తనుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పోలవరం ముంపు సర్వే నిర్వహణను ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండటాన్ని తెలంగాణ తీవ్రంగా నిరసిస్తోంది.
పోలవరం నుంచి 35 లక్షల క్యూసెక్కుల వరద విడుదలైతే తెలంగాణలో మునిగిపోయే గ్రామాలు దాదాపుగా వందవరకు ఉంటాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. అయితే 50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైతే నిర్వాసిత గ్రామాల సంఖ్య 250 పైగా పెరిగే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది.