తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభలో ముఖ్య అతిధిగా హాజరైన రాహుల్ తెలంగాణ ఫై వరాల జల్లు కురిపించారు.
అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా/ డయాలసిస్ పేషంట్లకు చేయూత పథకం కింద నెలకు రూ. 4000 పింఛన్ అందించనున్నట్లు ప్రకటించారు. ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ అని పేర్కొంటూ ఈ పథకాన్ని ప్రకటించారు.
ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉత్సాహంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని అభివర్ణించారు. మీ మనసుల్లో, మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని పేర్కొన్నారు. పీపుల్ మార్చ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అభినందిస్తున్నట్టు తెలిపారు.
భట్టి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు భరోసా ఇచ్చారని కొనియాడారు. ఈ సభ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నందుకు పొంగులేటికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని అభినందించారు.
ఒకప్పుడు తెలంగాణ అనేది పేదలకు, రైతులకు, అందరికీ ఓ స్వప్నంలా ఉండేదని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిన ఆ స్వప్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ల పాటు ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు తానో రాజులా భావిస్తుంటారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తన జాగీరు అనుకుంటున్నారని విమర్శించారు.
“ధరణి భూముల సమస్యను భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలుసుకున్నా. మిషన్ భగీరథలో కోట్లు దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. అన్ని విధాలుగా ప్రజలను దోచుకున్నారు” అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇటీవలే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. అక్కడ నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం ఉండేది. ఆ అవినీతి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలిచిందని తెలిపారు. గతంలో, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ అనేవాళ్లమని చెబుతూ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు.
బీజేపీ ఎప్పుడో ఖతమ్ అయిపోయిందని చెబుతూ ఏమైందో తెలియదు కానీ, బీజేపీ బండికి నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయని ఎద్దేవా చేశారు. పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే అని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎలాగైతే బీజేపీని ఓడించామో, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి బీ టీమ్ గా ఉన్న బీఆర్ఎస్ ను కూడా అలాగే ఓడించబోతున్నాం అని రాహుల్ ధీమా వ్యక్తం చేసారు.