ఏపీలో మహిళల అదృశ్యంకు, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధం ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒక వంక వైసిపి మంత్రులు పవన్ కళ్యాణ్ వాఖ్యాలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఈ వాఖ్యలపై వివరణలు ఇవ్వాలంటూ ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్ ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది.
మరోవైపు పవన్ కల్యాణ్‌పై అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారాహి యాత్రలో పవన్ తమపై నిందలు వేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు చెప్పారు. తాము ఏం చేస్తున్నామో ఆయన చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల వెనుక వాలంటీర్లు ఉన్నారని కేంద్ర నిఘా వర్గం చెప్పిందని ఆరోపణలు చేశారు. ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వలంటీర్ల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్స్‌పై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని మహిళా కమీషన్ నోటీసులో స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ఒంటరి మహిళల్ని అవమానపరిచేలా మాట్లాడారని, ఆయన వివరణ ఇచ్చే వరకు మహిళా కమిషన్ వెంటాడుతుందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.
వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ఇంటిలిజెన్స్ విడుదల చేసిందని చెబుతున్న నివేదికను బయటపెట్టాలని ఆమె నిలదీశారు. పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ మెయిల్స్ ద్వారా పవన్ పై మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె చెప్పారు.
వాలంటీర్స్‌పై పవన్ కళ్యాణ్ విషం కక్కుతున్నారని పద్మ మండిపడ్డారు. పవన్ కు ఏ ఇంటిలిజెన్స్ అధికారి చెప్పారో సమాధానం చెప్పాలని అంటూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి తప్పించుకోలేరని ఆమె హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని అనుమానం కలుగుతోందని పేర్కొంటూ వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో 1400 మిస్సింగ్ కేసులు మాత్రమే ఉన్నాయని చెబుతూ పవన్ కళ్యాణ్ చెప్తున్న 30వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని పద్మ నిలదీశారు. యువత చెడిపోవడానికి పవన్ కళ్యాణ్ సినిమాలే కారణమని ఆమె మండిపడ్డారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, ఆందోళను నిర్వహిస్తున్నారు. పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమను బాధించాయని, మహిళలమే ఎక్కువమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నామని వాపోతున్నారు. పవన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరామని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలు మాత్రమే తీసుకుంటామని, లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు తీసుకోమని స్పష్టం చేశారు. మహిళా వాలంటీర్లు అందరికీ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.